వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల నుంచి బదిలీ చేస్తుండడం పట్ల సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ జాబితాలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒకరు. ఆయన నిన్న పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. తన రాజీనామాపై నేడు ఆయన ట్విట్టర్ లో అప్ డేట్ ఇచ్చారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని, దానికి సంబంధించిన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్ కు పంపానని వెల్లడించారు. అదే సమయంలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని, దానికి సంబంధించిన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపానని తెలిపారు. తన రాజీనామాను 2024 జనవరి 23 నుంచి ఆమోదించాలని కోరానని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.