రైతుబంధు వృథా అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. శనివారం జనగామ నియోజకవర్గం చేర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే రైతుబంధు క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్నారు. బీఆర్ఎస్ మీ కళ్లముందే పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు. కానీ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందేనని, తెలంగాణను ముంచిందే ఆ పార్టీ అన్నారు. 58 ఏళ్ల పాటు తెలంగాణకు నష్టం చేసిందన్నారు. 2004లో మనతో పొత్తు కారణంగానే కాంగ్రెస్… తెలంగాణలో, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందని, అయినా రాష్ట్రాన్ని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. దీంతో తెలంగాణ కోసం అందరం ఉద్యమించామన్నారు. చివరకు కేసీఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో అని తాను ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలన, ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకోవాలన్నారు.