కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు మీడియా ఎదుట ఎందుకు ప్రవేశపెట్టలేదని, దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలని అన్నారు. ఇప్పటివరకు నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కారు, మంత్రి హరీష్ రావుపై ఆయన విమర్శల దాడి చేశారు.