టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బూతులు తప్ప భవిష్యత్తు తెలియదని మంత్రి హరీశ్ రావు అన్నారు. మ‌హ‌బూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి శంక‌ర్ నాయ‌క్‌కు మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఓట్లు అడిగేందుకు వస్తోన్న బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు మానుకోట ద‌మ్మేంటో చూపించాల‌ని పిలుపునిచ్చారు. ఉద్యమం సమయంలో సమైక్యవాదులకు మానుకోట చుక్కలు చూపిందన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. మానుకోట మట్టికి, రాళ్లకు దండం పెడుతున్నానన్నారు. మానుకోట దెబ్బతో స‌మైక్య‌వాదులు వెనక్కి పరుగెత్తారని, ఇప్పుడూ అలాంటి చైత‌న్యం రావాలని ప్రజలనుద్దేశించి అన్నారు. తెలంగాణ మీద దండెత్త‌డానికి వ‌స్తోన్న ఢిల్లీ పార్టీల‌కు మానుకోట ద‌మ్మేంటో చూపించాల‌న్నారు. 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశార‌న్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాలా? బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అనేది ప్ర‌జ‌లు తేల్చుకోవాలన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీల సమావేశాలు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయ‌ని, బీఆర్ఎస్ సభలు జన సముద్రంలా ఉన్నాయ‌న్నారు. బీఆర్ఎస్ సుపరిపాలన అందిస్తోందని, కాబట్టి ప్రజలు రిస్క్ తీసుకోవద్దని సూచించారు.