ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారం ఖాయం అని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది. కేవలం 11 స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితం అయింది. ఈ ఓటమి తరువాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తూ భవిష్యత్ పైన భరోసా కల్పిస్తున్నారు. ఈ టైంలోనే జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 2019 ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ..కుటుంబ సభ్యులు ఉంటున్నారు . చివరిసారిగా జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు వచ్చినప్పుడు చివరి సారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు. అక్కడ తల్లి విజయమ్మతో సమావేశం అయ్యారు. . అక్కడ కొంత మేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉండటంతో ప్రస్తుతం లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు. ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేసినట్లు గుర్తించి గతంలోనే వీటిని తొలిగించాలని నోటీసులు ఇచ్చారు. ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉండటం..తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. దీని పైన వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి