సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంలో భాగంగా పొలం సొంతదారులకు ఇచ్చే పట్టాదార్ పాస్ బుక్కు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని అన్నారు. సీపీఐ నారాయణ చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామం అయినంబాకం విచ్చేశారు. అక్కడ పొలాలను సందర్శించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష రాయి వద్ద కూర్చుని, పట్టాదార్ పాస్ బుక్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ఈ జగనన్న భూ రక్ష పుస్తకం ఒట్టి డొల్ల. జగనన్న భూ రక్ష పథకం కింద ఆయన బొమ్మేసి, పుస్తకాలు ప్రింట్ చేసి ఇదే మీ పాస్ పుస్తకం అని ఇస్తున్నారు. ఇది దేనికీ పనికిరాదని వాళ్లే చెబుతున్నారు! బ్యాంకు రుణం తీసుకొను సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేయు సందర్భంలో కానీ, ఈ భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం అధికారికి చూపించనవసరం లేదని ఆ పుస్తకంలోనే పేర్కొన్నారు. అంటే… ఇది బోగస్ పుస్తకం… దేనికీ పనికిరాదు అని అర్థమవుతోంది. ఆయన (సీఎం జగన్) బొమ్మేసి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు” అని నారాయణ విమర్శలు చేశారు.