PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
27 November 2026, 11:11 AM · తెలంగాణPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

పంట నష్టపోయింది కౌలు రైతు.. పరిహారం భూయజమానికా?

పంట నష్టపోయింది కౌలు రైతు.. పరిహారం భూయజమానికా?
పంట నష్టపోయింది కౌలు రైతు.. పరిహారం భూయజమానికా?

ప్రాంతం: హైదరాబాద్

PJNews | హైదరాబాద్: భూమిని కౌలుకు తీసుకుని, అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులకు కరువు కన్నీళ్లు మిగిల్చింది. ఇప్పుడు పంట నష్టం సర్వేలోనూ తమ పేర్లు నమోదు చేయడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను విడుదల చేసింది.

సంగారెడ్డిలో కేవలం ఎనిమిది మందే!

కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో పంట నష్టం సర్వేలో 1,74,846 మంది రైతుల వివరాలు నమోదు కాగా, వారిలో కౌలు రైతులు కేవలం ఎనిమిది మందే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 37,666 మంది రైతుల్లో 481 మంది కౌలుదారులుగా నమోదయ్యారు.

ఈ నెల 21 నుంచి 24 వరకు ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని పది గ్రామాల్లో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు అధ్యయనం నిర్వహించారు. మొత్తం 145 మంది రైతులను కలవగా, వారిలో 89 మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ఒక్కరి పేరూ పంట నష్టం సర్వేలో సాగుదారుడిగా నమోదు కాలేదని కమిటీ పేర్కొంది.

కౌలు చెల్లించి.. పంట నష్టపోయి

భూమి కౌలు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులన్నీ భరించిన రైతులకు పంట నష్టంతో అప్పుల భారం పెరిగింది. అధ్యయనంలో పరిశీలించిన పత్తి సాగు భూముల్లో ఎకరానికి సాధారణంగా పది క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 3.6 క్వింటాళ్లకు పడిపోయిందని వెల్లడించారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అసలు సాగుదారులను గుర్తించాలని కమిటీ కోరింది.

యాప్‌లో మార్పులు చేయాలి

రైతుభరోసా యాప్‌లో భూయజమాని పేరు నమోదైన తర్వాత అదే భూమికి సంబంధించిన కౌలు రైతు వివరాలను జత చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతినిధులు తెలిపారు.

భూయజమాని అనుమతితో సంబంధం లేకుండా స్వీయ ధ్రువీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కౌలు రైతులను గుర్తించాలని కోరారు. ఇప్పటికే పూర్తయిన నమోదులను సవరించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

2011 నాటి లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేయడంతో పాటు కౌలు రైతుల గుర్తింపు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెంటనే సమావేశం కావాలని కోరారు.

గ్రామాల వారీగా పంట నష్టం వివరాలను బహిర్గతం చేసి, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. ఈ అధ్యయనంలో వెల్లడించిన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.