PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
28 November 2026, 09:04 AM · రాజకీయాలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

భూ యజమానులకు శుభవార్త.. క్యూఆర్ కోడ్‌తో ఉచిత పాసుపుస్తకాలు!

భూ యజమానులకు శుభవార్త.. క్యూఆర్ కోడ్‌తో ఉచిత పాసుపుస్తకాలు!
భూ యజమానులకు శుభవార్త.. క్యూఆర్ కోడ్‌తో ఉచిత పాసుపుస్తకాలు!

PJNews | హైదరాబాద్: తెలంగాణలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూవివాదాలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేపై దృష్టి సారించింది. వచ్చే 18 నెలల్లో రీసర్వే పూర్తి చేసి భూ యజమానులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన వాటర్‌ప్రూఫ్ పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా అందజేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వివరాలను వెల్లడించారు.

డిసెంబరు చివరికి 373 గ్రామాల్లో సర్వే

సరైన భూ పటాలు అందుబాటులో లేని 373 గ్రామాల్లో రీసర్వే చేపట్టామని మంత్రి తెలిపారు. ఆయా గ్రామాల్లో డిసెంబరు చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సర్వే వేగవంతం చేసేందుకు మండలాల్లో సర్వే బృందాల సంఖ్యను పెంచుతున్నారు.

ఒక్క పాసుపుస్తకంలో భూముల వివరాలు

కొత్త పట్టాదారు పాసుపుస్తకంపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూమి సర్వే నంబరు, విస్తీర్ణం, మ్యాప్ వివరాలు తెలుసుకోవచ్చు. ఒకే యజమానికి వేర్వేరు సర్వే నంబర్లలో భూములుంటే వాటి వివరాలను ఒకే పాసుపుస్తకంలో పొందుపరచనున్నారు. వ్యవసాయ భూములు, గ్రామీణ నివాస స్థలాలకు వేర్వేరు రంగుల్లో పత్రాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇళ్ల స్థలాలకూ ప్రత్యేక గుర్తింపు

గ్రామాల్లోని ఇళ్లు, నివాస స్థలాలు, ఆబాదీ ప్రాంతాల్లోని ఆస్తులను కూడా సర్వే పరిధిలోకి తీసుకురానున్నారు. స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా మ్యాప్‌తో కూడిన ఆస్తి గుర్తింపు పత్రాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అభ్యంతరాలకు అవకాశం

సర్వే నిర్వహించే తేదీలను గ్రామస్థులకు ముందుగానే తెలియజేయనున్నారు. కొలతలు పూర్తయ్యాక నమోదైన విస్తీర్ణాన్ని భూ యజమానులకు తెలియజేస్తారు. అభ్యంతరాలుంటే అధికారులు పరిశీలించి, సరైన ఆధారాలున్న సందర్భాల్లో సవరణలు చేపడతారు.

భూముల హద్దులు, విస్తీర్ణంపై రైతుల మధ్య వివాదాలు తలెత్తితే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేటు భూవివాదాల్లో చట్టప్రకారమే వ్యవహరిస్తామని, ప్రభుత్వ భూముల విషయంలో అధికారిక రికార్డులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

భూముల కొలతల్లో తేడాలు, రికార్డుల్లో పొరపాట్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ప్రక్రియ కీలకం కానుంది. అయితే కొత్త పాసుపుస్తకాల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? గ్రామాలవారీగా సర్వే షెడ్యూల్ ఎలా ఉంటుంది? అభ్యంతరాలను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెల్లడించాల్సి ఉంది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.