PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
26 November 2026, 06:45 AM · రాజకీయాలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

తెలంగాణలో నేడే కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ

తెలంగాణలో నేడే కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ
తెలంగాణలో నేడే కొత్త చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీ

PJNews | హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు నేడు నగదు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న చేయూత పింఛన్లతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం 4,63,857 మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు అర్హులైన ఇతర వర్గాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందనుంది.

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిళల అభిరుచులకు అనుగుణంగా చిలుకపచ్చ రంగులో చీరలను తయారు చేయించారు. రాష్ట్రంలోని నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా చీరల తయారీ బాధ్యతలను అప్పగించారు.

చీరలు పొందేందుకు అర్హతలు ఇవే

రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులు. ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు వివరాల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించనున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్‌లో పంపిణీ వివరాలను నమోదు చేయనున్నారు.

జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా పంపిణీ చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

పింఛన్ నగదు విడుదల అనంతరం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవచ్చు. చీరల పంపిణీ కేంద్రాలు, స్థానిక షెడ్యూల్ వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.