ప్రాంతం: Miyapur, Cyberabad
PJNews | Miyapur : మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులను మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి సంగారెడ్డి పట్టణానికి చెందిన ముత్యాల కళ్యాణ్ రాజ్ (19) అనే విద్యార్థిని అదుపులోకి తీసుకుని, సుమారు రూ.3 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతాల్లో హ్యాండిల్ లాక్ వేయకుండా నిలిపిన వాహనాలను నిందితుడిగా పేర్కొన్న యువకుడు లక్ష్యంగా చేసుకునేవాడు. ముందుగా పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి, సరైన భద్రత లేకుండా ఉన్న బైక్‌లను గుర్తించి చోరీ చేసేవాడని పోలీసులు తెలిపారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన దర్యాప్తు బృందం అనుమానాస్పద కదలికలను గుర్తించింది. ఆ ఆధారాలతో తదుపరి దర్యాప్తు చేపట్టి కళ్యాణ్ రాజ్‌ను పట్టుకున్నట్లు వెల్లడించింది. విచారణలో భాగంగా పంచనామా నిర్వహించి యమహా MT-15, KTM డ్యూక్, సుజుకి యాక్సెస్, హోండా ప్యాషన్, టీవీఎస్ జూపిటర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు వేర్వేరు కేసులు నమోదైనట్లు ప్రెస్‌నోట్‌లో తెలిపారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, అదనపు డీసీపీ ఎం. సుదర్శన్, కేపీహెచ్‌బీ ఏసీపీ ఈ. రవికిరణ్ రెడ్డి పర్యవేక్షణలో మియాపూర్ పోలీసు సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.
వాహనదారులు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలని, వీలైతే అదనపు డిస్క్ లేదా చైన్ లాక్ ఉపయోగించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

