PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
28 November 2026, 11:10 PM · తెలంగాణPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

మన్సూరాబాద్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు మాయం!

మన్సూరాబాద్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు మాయం!
మన్సూరాబాద్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు మాయం!

ప్రాంతం: హైదరాబాద్

PJNews | ఎల్బీనగర్:హైదరాబాద్‌లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో ఓ ఇంట్లోకి చొరబడిన నలుగురు దుండగులు ఇద్దరు మహిళలను బంధించి రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అందిన సమాచారం ప్రకారం.. స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉన్న కొమ్మరవెల్లి సంపత్‌కుమార్ తన బావ విజయ్‌కుమార్ రెడ్డి బ్యాంకు ఖాతాకు రూ.3.20 కోట్లు పంపించారు. బ్యాంకు నుంచి నగదును విత్‌డ్రా చేసి భద్రత కోసం ఓ ఇంట్లో ఉంచినట్లు తెలుస్తోంది.

శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మణెమ్మ (65), ఆమె కోడలు మౌనికలను బంధించారు. అనంతరం ఇంట్లో ఉంచిన రూ.3.20 కోట్ల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు వెల్లడించారు.

దుండగులు వెళ్లిపోయిన తరువాత మహిళలు కేకలు వేయడంతో పొరుగింటి వారు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

నగదు ఉన్న విషయం ముందే తెలుసా?

ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉంచిన విషయం దుండగులకు ఎలా తెలిసిందన్నది ఈ కేసులో కీలకంగా మారింది. నగదు లావాదేవీల గురించి ముందస్తు సమాచారం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అనుమానాలపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు.

బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసిన సమయం, నగదును ఇంటికి తరలించిన విధానం, ఆ విషయం ఎంతమందికి తెలుసన్న అంశాలు కేసు ఛేదనలో కీలకం కానున్నాయి.

పట్టపగలే నివాస ప్రాంతంలోకి చొరబడి మహిళలను బంధించి కోట్ల రూపాయల నగదును ఎత్తుకెళ్లడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. దోపిడీకి పాల్పడిన వ్యక్తులు ఎవరు? నగదు ఉన్న సమాచారం వారికి ఎలా చేరింది? ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.