PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
29 November 2026, 10:04 AM · తెలంగాణPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

డీసీపీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు క్లోజ్.. ఆస్తుల జప్తు ప్రక్రియకు ముగింపు!

డీసీపీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు క్లోజ్.. ఆస్తుల జప్తు ప్రక్రియకు ముగింపు!
డీసీపీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు క్లోజ్.. ఆస్తుల జప్తు ప్రక్రియకు ముగింపు!

ప్రాంతం: మల్కాజిగిరి

PJNews | హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ గోవిందు నరసింహారెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర హోంశాఖ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆస్తుల జప్తుకు సంబంధించిన ప్రక్రియను ముగిస్తూ నవంబర్ 26న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

2019లో ఏసీబీ కేసు నమోదు

సిద్దిపేట అదనపు ఎస్పీగా నరసింహారెడ్డి పనిచేస్తున్న సమయంలో 2019లో ఏసీబీ అధికారులు ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. దర్యాప్తులో రూ.3.25 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు వెల్లడైంది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఆయా ఆస్తుల విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఏసీబీ లెక్కల ప్రకారం నరసింహారెడ్డి ఆదాయం రూ.1.86 కోట్లు కాగా, వ్యయం రూ.3.42 కోట్లుగా నమోదైంది. తెలిసిన ఆదాయ వనరులతో పోలిస్తే 174.40 శాతం మేర అదనపు ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో పేర్కొన్నారు.

ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరణ

దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు 2023 నవంబర్ 23న ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారు. సంబంధిత అధికారిపై న్యాయపరమైన చర్యలకు అనుమతి కోరారు. అయితే 2026 ఏప్రిల్ 29న జీవో నంబర్ 316 ద్వారా హోంశాఖ ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించింది.

ఉగ్రవాద నిరోధక, నిఘా సంబంధిత విభాగాల్లో ఆయన నిర్వర్తించిన ప్రమాదకర విధులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. న్యాయస్థానంలో ఆరోపణలను నిరూపించేందుకు అవసరమైన స్థాయిలో ఆధారాలు లేవని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు సమాచారం.

శాఖాపరమైన విచారణకు ఆదేశం

వార్షిక ఆస్తుల వివరాల సమర్పణ, ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు ముందస్తు అనుమతులు పొందడం వంటి సేవా నిబంధనలకు సంబంధించిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయం అనంతరం కేసును ముగించేందుకు ఏసీబీ సమర్పించిన తుది నివేదికను అక్టోబర్ 9న న్యాయస్థానం ఆమోదించింది. తాజాగా నవంబర్ 26న ఆస్తుల జప్తుకు సంబంధించిన ప్రక్రియను కూడా ముగించింది.

క్రిమినల్ కేసు ముగిసినప్పటికీ శాఖాపరమైన విచారణకు సంబంధించిన తుది ఫలితం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత డీసీపీ వ్యక్తిగత స్పందన అందుబాటులో లేదు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.