PJNews | న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో వినియోగించే భారీ యంత్రాలు, వాటి విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.11 వేల కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వదేశంలోనే అధునాతన యంత్రాల తయారీ
ప్రస్తుతం విదేశాల నుంచి పూర్తిగా లేదా అధికంగా దిగుమతి చేసుకుంటున్న ఏడు రకాల యంత్రాల తయారీపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. సొరంగాల తవ్వకానికి ఉపయోగించే యంత్రాలు, భారీ ట్రక్కులు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, లోడర్లు, పైలింగ్ రిగ్స్, డ్రిల్లింగ్ యంత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హత పొందిన యంత్రాలు, విడిభాగాల తయారీ సంస్థలకు అదనపు అమ్మకాల విలువ ఆధారంగా 8 నుంచి 13 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ఎనిమిదేళ్ల పాటు అమలు
2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2033–34 వరకు ఈ పథకం కొనసాగనుంది. తొలి రెండేళ్లు తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేటాయించగా, తదుపరి ఐదేళ్లు ప్రోత్సాహకాలు అందిస్తారు. చివరి ఏడాది బకాయి ప్రోత్సాహకాల చెల్లింపులు చేపడతారు.
యంత్రాల నాణ్యత, పనితీరును పరీక్షించేందుకు ప్రత్యేక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రూ.375 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
రూ.2.28 లక్షల కోట్లకు మార్కెట్
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25లో రూ.97,500 కోట్లుగా ఉన్న దేశీయ నిర్మాణ యంత్రాల మార్కెట్ 2029–30 నాటికి రూ.2.28 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. రహదారులు, ఓడరేవులు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల విస్తరణ ఇందుకు దోహదపడనుంది.
కొత్త పథకంతో దేశీయ తయారీ సంస్థలకు వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు ఉపాధి కల్పనకు దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే పథకం కింద దరఖాస్తులు, సంస్థల ఎంపిక, అర్హతలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వెల్లడి కావాల్సి ఉంది.


