హైదరాబాద్, నవంబర్ 23 (PJ NEWS): బంగారు ఆభరణాలతో తరచూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. బినామీ లావాదేవీల అనుమానంతో రాయదుర్గంలోని భారీ అపార్ట్‌మెంట్ భవనాన్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది.
రాయదుర్గం నవ ఖల్సా గ్రామంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలైలో రూ.26.70 లక్షలకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ఉంది. ఇందులో రూ.1.70 లక్షలు నగదు రూపంలో, మరో రూ.25 లక్షలు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించారు. అయితే స్థలం కొనుగోలుకు అవసరమైన డబ్బును తన బావ సమకూర్చినట్లు ప్రణయ్ గౌడ్ విచారణలో వెల్లడించారని సమాచారం.
ఆ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మించారు. నిర్మాణ ఖర్చులను కూడా ప్రణయ్ గౌడ్ బావే భరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆస్తి కొనుగోలు సమయంలో ప్రణయ్ విద్యార్థిగా ఉండటం, పన్ను చెల్లించదగిన ఆదాయం లేకపోవడం అధికారుల అనుమానాలకు కారణమైంది.
మరోవైపు, అపార్ట్‌మెంట్ ద్వారా నెలకు సుమారు రూ.3.20 లక్షల అద్దె వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్ము ప్రణయ్ గౌడ్ ఖాతాకు కాకుండా ఆయన బావ భార్యకు చెందిన సిటీ యూనియన్ బ్యాంకు ఖాతాలో జమవుతున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆమె భర్త ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.
ఈ వివరాల ఆధారంగా ప్రణయ్ గౌడ్‌ను బినామీదారుడిగా, ఆయన బావను అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం–1988లోని సెక్షన్ 24(4)(a) కింద ఈ చర్యలు చేపట్టారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆస్తి విక్రయం, బదిలీపై ఆంక్షలు కొనసాగనున్నాయి.


