PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
28 November 2026, 08:59 PM · రాజకీయాలుPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!

గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!
గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!
  • బ్లాస్టింగ్‌తో భవనాలకు ప్రకంపనలు వస్తున్నాయని స్థానికుల ఆందోళన
  • శబ్దం, దుమ్ము, ధూళితో చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు
  • జోనల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి
  • కమిషనర్ ఆదేశాలతో నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించిన అధికారులు

PJNews | కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ చేపట్టిన అపార్ట్‌మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్‌తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాస్టింగ్ సమయంలో భవనాలు కంపిస్తున్నాయని, పెద్ద ఎత్తున వెలువడుతున్న శబ్దం, దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జోనల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి

స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు శనివారం జనసేన నాయకులు కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!

బ్లాస్టింగ్ సమయంలో వస్తున్న ప్రకంపనలతో భవనాల భద్రతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారని కమిషనర్‌కు వివరించారు. శబ్ద కాలుష్యంతో రాత్రిపూట చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దుమ్ము, ధూళి కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

రంగంలోకి దిగిన అధికారులు

వినతిపై స్పందించిన జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించాలని డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, అసిస్టెంట్ కమిషనర్ రమణలను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన నాయకులతో చర్చించారు. అనంతరం నిర్మాణ నిర్వాహకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జనసేన నాయకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, ఆళ్ల నరేంద్ర, పోలెబోయిన శ్రీనివాస్, గోవిందా, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

బ్లాస్టింగ్ భద్రతపై తేలాల్సిన అంశాలెన్నో!

జనావాసాల మధ్య జరుగుతున్న నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్‌కు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారా? ప్రకంపనల తీవ్రతను కొలుస్తున్నారా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. సమీప భవనాల భద్రత, శబ్ద నియంత్రణ, దుమ్ము నివారణకు నిర్మాణ సంస్థ తీసుకుంటున్న చర్యలను వెల్లడించాల్సి ఉంది.

గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!

స్థానికుల ఫిర్యాదులపై అధికారుల తనిఖీలో ఏం తేలింది? తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై గోద్రెజ్ ప్రాపర్టీస్ యాజమాన్యం అధికారిక వివరణ కూడా అందాల్సి ఉంది.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.