PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
26 November 2026, 09:46 PM · నగర వార్తలుPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ సత్తా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం!

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ సత్తా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం!
పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ సత్తా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం!
  • ముగిసిన మూడో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్
  • విజేతలకు ట్రోఫీలు అందజేసిన డీజీపీ సీవీ ఆనంద్
  • వ్యక్తిగత ఛాంపియన్‌గా సైబరాబాద్ ఎస్సై ప్రేమ్ సాగర్
  • జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం కావాలని డీజీపీ పిలుపు

PJNews | సైబరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్–2026లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సత్తా చాటింది. ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన మూడో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ గురువారం ముగిసింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సైబరాబాద్ కమిషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ముగింపు కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. రాష్ట్రంలోని 17 జోన్లు, ప్రత్యేక విభాగాలకు చెందిన 421 మంది పోటీదారులను అభినందించారు. మొత్తం 63 మంది పతకాలు సాధించగా, అందులో 21 స్వర్ణ, 21 రజత, 21 కాంస్య పతకాలు ఉన్నాయి.

శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులకు సంబంధించిన ‘సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్’ విభాగంలో సైబరాబాద్ ఎస్సై ఆర్. ప్రేమ్ సాగర్ ఓవరాల్ వ్యక్తిగత ఛాంపియన్‌షిప్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ సత్తా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం!

జాతీయ ఛాంపియన్‌షిప్ నిలబెట్టుకోవాలి

డిసెంబర్ 15 నుంచి 20 వరకు ముంబైలో నిర్వహించనున్న అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన తెలంగాణ పోలీస్ బృందం కఠిన శిక్షణతో సన్నద్ధం కావాలని డీజీపీ సూచించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గతంలో జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి పెండింగ్‌లో ఉన్న నగదు ప్రోత్సాహకాలు, ఇంక్రిమెంట్ల మంజూరును వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

నిర్వహణ కమిటీ ఛైర్మన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే పోటీలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, కమిటీ సభ్యులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.

శాస్త్రీయ దర్యాప్తునకు పెద్దపీట

ఆరు విభాగాలకు సంబంధించి నిర్వహించిన 21 పోటీల్లో దాదాపు 500 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. నూతన నేర చట్టాల అమలు నేపథ్యంలో శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ ఆధారాల సేకరణకు ఈ పోటీలు ప్రాధాన్యం ఇచ్చాయి.

నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఆధారాలను సమర్థవంతంగా సేకరించడం వంటి అంశాల్లో పోలీసుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపరచడంలో ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయి.

రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ జాతీయ పోటీలకు ముందు ప్రత్యేక గుర్తింపు పొందింది. ముంబైలో జరగనున్న పోటీల్లో తెలంగాణ బృందం ప్రదర్శనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ సత్తా.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం!

ముగింపు కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, న్యాయనిర్ణేతలు, పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది, పోటీదారులు పాల్గొన్నారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.