PJNews | సైబరాబాద్: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత పోలీసులపైనే కాదు.. ప్రతి ఒక్కరిపైనా ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) చైర్మన్ డాక్టర్ ఎం. రమేశ్ అన్నారు. ఒంటరిగా వాహనాల్లో ప్రయాణించే అలవాటుకు స్వస్తి పలికి, కార్‌పూలింగ్‌తో పాటు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా నిర్వహించనున్న ‘సైబరాబాద్ మూవ్స్–2026’ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం కమిషనరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ‘హాయ్ బోలో.. దిల్ ఖోలో.. నో సోలో.. సాథ్ చలో’ నినాదంతో ప్రతి ఒక్కరూ ‘మేము సైతం’ అంటూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఐదు సీట్ల కారులో ఒక్కరే ప్రయాణించకుండా కనీసం మరొకరిని వెంట తీసుకురావాలని సూచించారు. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు పలుమార్లు కార్లలో తిరిగే తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలన్నారు. సైకిళ్లపై ప్రయాణించే వారికి ప్రత్యేక లేన్, సురక్షిత ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
జేఎన్‌టీయూ నుంచి ఐకియా ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనదారుల్లో దాదాపు 65 శాతం మంది గంట నుంచి గంటన్నర వ్యవధిలో ప్రయాణిస్తుండటంతో రద్దీ పెరుగుతోందని వివరించారు. ఆ సమయంలో ఆర్టీసీ సహకారంతో ఎక్కువ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.
నివాస సంక్షేమ సంఘాలు, ఐటీ కంపెనీలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలతో నెల రోజులుగా చర్చలు జరిపామన్నారు. ఫీనిక్స్, ఇన్ఫోసిస్ సంస్థలు ఉద్యోగుల్లో కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. సీఎంసీ, ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయన్నారు.
సీసీ కెమెరాలు, వాహనాల లెక్కింపు యంత్రాల ద్వారా మూడు రోజుల ట్రాఫిక్ పరిస్థితులను గతంలోని రద్దీతో పోల్చి ప్రజలకు ఫలితాలను చూపిస్తామని సీపీ తెలిపారు.
టీ-హబ్‌లో నిర్వహించే వర్క్‌షాప్‌లు, సదస్సులు, ట్రాఫిక్ టాక్స్ ద్వారా ప్రజల నుంచి ఆచరణాత్మక సూచనలు స్వీకరించనున్నారు.
సమావేశంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్–1 డీసీపీ డాక్టర్ ఎస్. రవికుమార్, అదనపు డీసీపీ హనుమంతరావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవీద్ ఆలం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


