సైబరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ప్రజల ప్రయాణ అలవాట్లలో మార్పు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను కార్‌పూలింగ్ వైపు ప్రోత్సహించాలని సూచించారు.
ఆదివారం ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్, సైబరాబాద్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో 12 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జేఎన్‌టీయూ నుంచి ప్రారంభమైన ర్యాలీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ముగిసింది. ఇందులో సైక్లింగ్ ఔత్సాహికులు, ట్రాఫిక్ పోలీసులు సహా 150 మందికి పైగా పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సైబరాబాద్ సీపీ రమేష్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గితే ట్రాఫిక్ సమస్యతో పాటు గాలి, శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. ఒకే ప్రాంతానికి వెళ్లే ఉద్యోగులు వేర్వేరు కార్లలో ప్రయాణించే బదులు వాహనాలను పంచుకోవాలని సూచించారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోసం కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని కోరారు.
‘దిల్ ఖోలో, నో సోలో, సాథ్ చలో’ అంటూ ఒంటరి ప్రయాణాలను తగ్గించి కలిసి ప్రయాణించే అలవాటు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు.
మూడు రోజులపాటు నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమంలో ప్రజా రవాణా, సైక్లింగ్, పాదచారులకు అనుకూలమైన మౌలిక వసతులు, భవిష్యత్తు రవాణా అవసరాలపై చర్చించారు.


