PJNEWSPOWER OF JOURNALISM
⌂ Home
SCAN STORY
22 November 2026, 09:29 PM · నగర వార్తలుTHE DIGITAL EDITION OF Published by PJ Television Private Limited

సీజ్ చేశారు సరే.. మళ్లీ తెరిచిందెవరు?

సీజ్ చేశారు సరే.. మళ్లీ తెరిచిందెవరు?
సీజ్ చేశారు సరే.. మళ్లీ తెరిచిందెవరు?
  • బాచుపల్లిలో మున్సిపల్ అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం!
  • చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?
  • నీటిపారుదల శాఖ లేఖ రాసినా పనులు ఎందుకు ఆగడం లేదు?
  • సీజ్ చేసిన చోట మళ్లీ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతిచ్చిందెవరు?
  • రాయల్ ఓక్ షోరూమ్‌కు వేసిన సీల్ ఎలా తొలగింది?
  • సీజ్ చేసిన భవనాల వివరాలు బయటపెట్టేందుకు అధికారులకు అభ్యంతరమేంటి?

బాచుపల్లి, PJNews : అక్రమ నిర్మాణాలపై చర్యలంటూ హడావుడి చేయడం.. భవనాలకు సీళ్లు వేయడం.. ఆ తర్వాత మళ్లీ పనులు మొదలవడం! బాచుపల్లిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజాంపేట మున్సిపల్ అధికారుల పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖే లేఖ రాసినా వాటిని పూర్తిగా అడ్డుకున్నారా లేదా అన్నది తేలడం లేదు. మరోవైపు సీజ్ చేసిన భవనాలు తిరిగి తెరుచుకుంటున్నాయన్న ఆరోపణలు అధికారుల చర్యలపై సందేహాలను పెంచుతున్నాయి.

చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు!

బాచుపల్లి పెద్ద చెరువు (బిన్ చెరువు) FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు 2026 జనవరిలోనే గుర్తించారు. చెరువు పరిధిలో ఆర్‌సీసీ ఫుటింగ్, ప్రహరీ గోడ నిర్మాణాలు చేపట్టడంతో పాటు మట్టి పోసి భూమిని చదును చేసినట్లు తమ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పనులు వెంటనే ఆపాలని, అనుమతులు ఇచ్చి ఉంటే రద్దు చేయాలని హైడ్రా కమిషనర్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌ను కోరారు. మరి ఆ లేఖపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? చెరువు భూమిని కాపాడేందుకు అధికారులు ఏం చేశారన్నది ఇప్పుడు కీలక ప్రశ్న.

సీజ్ చేసిన చోట మళ్లీ పనులా?

సీజ్ చేశారు సరే.. మళ్లీ తెరిచిందెవరు?

చెరువు సమీపంలోని నిర్మాణానికి గతంలో మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. ఆ భవనం వద్ద సీలింగ్ నోటీసు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత అక్కడ తిరిగి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన నిర్మాణంలో పనులు మళ్లీ మొదలైతే అధికారులు ఎందుకు అడ్డుకోలేదు? సీల్ తొలగించేందుకు అనుమతి ఇచ్చారా? లేక అనుమతి లేకుండానే పనులు జరుగుతున్నాయా? అన్నది మున్సిపల్ అధికారులే చెప్పాలి.

రాయల్ ఓక్‌కు సీల్.. ఆ తర్వాత షోరూమ్ ఓపెన్!

బాచుపల్లి ఎస్వీఎస్ ఆభరణ రోడ్డులోని రాయల్ ఓక్ షోరూమ్‌కు ఏప్రిల్ 21న మున్సిపల్ అధికారులు సీల్ వేసినట్లు ఫొటోలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత అదే షోరూమ్ తెరుచుకుని వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నట్లు మరో ఫొటో ద్వారా తెలుస్తోంది.

సీల్ వేసినప్పుడు ఉన్న నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయలేదని క్షేత్రస్థాయి సమాచారం చెబుతోంది. మరి ఏ ప్రాతిపదికన షోరూమ్ తిరిగి తెరిచారు? సీల్ తొలగించేందుకు అధికారులు రాతపూర్వకంగా అనుమతిచ్చారా? ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులను బయటపెట్టడంలో ఇబ్బందేమిటి?

పక్కనే మరో నిర్మాణం.. అక్కడా అదే పరిస్థితా?

రాయల్ ఓక్ భవనానికి ఆనుకుని ఉన్న మరో నిర్మాణాన్ని కూడా గతంలో మున్సిపల్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సైతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో సీజ్ చేసిన నిర్మాణాల వద్ద తిరిగి పనులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తుంటే అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఈ నిర్మాణాలకు ఏమైనా కొత్త అనుమతులు ఇచ్చారా? నిబంధనల ఉల్లంఘనలు సరిచేశారా? లేక సీలింగ్ ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయా? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది.

మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాల్సిందే!

PJ NEWS photograph
Photo caption – click to edit

చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలపై నీటిపారుదల శాఖ లేఖ రాసింది. మున్సిపల్ అధికారులు కొన్ని భవనాలకు సీళ్లు వేశారు. అయినా నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? సీజ్ చేసిన షోరూమ్ తిరిగి ఎలా తెరుచుకుంది?

ఈ ప్రశ్నలకు సమాధానంగా నిజాంపేట మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు, సీలింగ్ ఉత్తర్వులు, సీల్ తొలగింపునకు సంబంధించిన రికార్డులు, తాజా తనిఖీ నివేదికలను బహిర్గతం చేయాలి. హైడ్రా కూడా చెరువు పరిరక్షణకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వెల్లడించాలి.

సీజ్ చేయడమే చర్య కాదు.. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రజలకు చెప్పడం కూడా అధికారుల బాధ్యతే!

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.