PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తా
⌂ Home
SCAN STORY
29 November 2026, 09:13 AM · రాజకీయాలుPRGI: TGTEL/25/A4038Published by PJ Television Private Limited

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలి: పీఏసీ చైర్మన్ గాంధీ

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలి: పీఏసీ చైర్మన్ గాంధీ
ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలి: పీఏసీ చైర్మన్ గాంధీ

అడ్డగోలు రోడ్ల తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలి.. సైబరాబాద్ మూవ్స్ సదస్సులో కీలక సూచనలు

PJNews | శేరిలింగంపల్లి: సైబరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. రాయదుర్గంలోని టీహబ్‌లో శనివారం జరిగిన సైబరాబాద్ మూవ్స్–2026 ముగింపు కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనతో కలిసి ఆయన పాల్గొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 26 నుంచి 28 వరకు ఈ సదస్సు నిర్వహించారు.

ఐటీ పరిశ్రమల వికేంద్రీకరణ అవసరం

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలి: పీఏసీ చైర్మన్ గాంధీ

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించడం ద్వారా ప్రయాణ సమయంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని గాంధీ పేర్కొన్నారు. డబుల్ డెక్కర్ బస్సుల సేవలను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో, ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

అడ్డగోలు తవ్వకాలపై నిఘా పెట్టాలి

నగరంలో అస్తవ్యస్తంగా ఫుట్‌పాత్ నిర్మాణాలు చేపడుతున్నారని గాంధీ పేర్కొన్నారు. పాదచారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఫుట్‌పాత్‌లు నిర్మించాలన్నారు. మొబైల్, ఫైబర్‌నెట్, గ్యాస్, విద్యుత్, జలమండలి సంస్థలు ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే రోడ్లను యథాస్థితికి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ వినియోగంపై అవగాహన

కొందరు ఆటో, క్యాబ్ డ్రైవర్లు వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, రీల్స్, సినిమాలు చూడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ విభాగంలో అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించి వారి సూచనలు తీసుకోవాలన్నారు. ఉదయం రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకల నియంత్రణపైనా దృష్టి సారించాలని సూచించారు.

వారంలో ఒక్కరోజైనా సైకిల్‌పై వెళ్లాలి

ఐటీ పరిశ్రమలను వికేంద్రీకరించాలి: పీఏసీ చైర్మన్ గాంధీ

ప్రజా రవాణా, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని గాంధీ తెలిపారు. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా సైకిల్‌పై ప్రయాణించాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల సదస్సులో విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.

pjnewslive.comPJ NEWS owl mark

One continuous digital clipping. Long articles make a taller image; JPG/PDF export depends on browser canvas limits.