ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. రెండు రోజులుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తూ.. టీటీడీకి కొత్త ఈవోను నియమించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలకు పేర్లు మార్చారు.. తాజాగా మరో కార్యక్రమానికి కూడా చంద్రబాబు సర్కార్ పేరు మార్చింది. గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో మార్పులు చేయాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ సిస్టమ్‌ పేరుతో ఫిర్యాదులను స్వీకరించనుందని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది..ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలు చేయాలని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో విజయం సాధించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌ల పరిశీలన కోసం.. ప్రజావేదిక నిర్మించింది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత స్పందన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అయితే స్పందన ద్వారా సమస్యలు పరిష్కారం కాలేదని భావించిన చంద్రబాబు సర్కార్.. రాష్ట్రస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టమ్ అమలవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.