సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కంటే ప్ర‌తిప‌క్షాల‌ను వేధించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు. ఆ పార్టీలో చేర‌కుంటే అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ప‌టాన్‌చెరు మండ‌లం ల‌క్డారంలో మైనింగ్‌కు అనుమ‌తులు ముగిసినా ప‌నులు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సోద‌రుడు మ‌ధుసూద‌న్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డంపై హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. 

“కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న‌ని గాలికి వ‌దిలేసింది. అక్ర‌మ కేసులు పెట్టి మా ఎమ్మెల్యేల‌ను గుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. వంద‌ల మంది పోలీసులు వెళ్లి తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వ‌కుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఈ విష‌యాన్నిపోలీసులు గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒక‌విధంగా జైలుకు పంపాల‌ని చూస్తున్నారు. అధికార పార్టీ నేత‌ల‌కు అక్క‌డ క్ర‌ష‌ర్లు ఉన్నాయి. వాటికి అనుమ‌తులు లేక‌పోయినా న‌డుస్తున్నాయి. బీఆర్ఎస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాల‌తో మేం దాడులు చేస్తున్నామ‌ని స్వ‌యంగా ఆర్‌డీఓ చెప్పారు. ఈ విష‌యంలో న్యాయ‌పోరాటం చేస్తాం. ప్ర‌జాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష వేస్తాం” అని హ‌రీశ్‌రావు చెప్పారు.