టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’ నుంచి తాజాగా ఓ గ్లింప్స్ వీడియో రిలీజైంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్ర పేరు అంజి కాగా, అంజి క్యారెక్టర్ ఎలా ఉంటుందో పరిచయం చేయడం కోసం ఈ గ్లింప్స్ వదిలారు. 

దీనికి సంబంధించిన వీడియోను నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. “మా అల్లరి అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం… లేదంటే మాటొచ్చేత్తది” అంటూ నాగ్ పల్లెటూరి యాసలో వెల్లడించారు. ఈ సినిమాలో అంజి పాత్రలో అల్లరి నరేశ్ తన ఎనర్జీతో ఉర్రూతలూగిస్తాడని వివరించారు. త్వరలోనే టీజర్ కూడా వస్తుందని నాగార్జున తెలిపారు. 

కాగా, ఈ గ్లింప్స్ వీడియోలో నాగార్జున, అల్లరి నరేశ్ ల ఫ్రెండ్షిప్ కు సంబంధించిన సీన్లు ఉన్నాయి. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.