రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్లకట్టలతో వెళుతున్న సీఐ కారును ఆపి, సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఓ కార్యకర్త సీఐ చెంప చెళ్లుమనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల సమీపంలో ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. 

కారులో నోట్ల కట్టలు తరలిస్తున్న వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావు అని సమాచారం. క్లాత్ బ్యాగ్ లో నోట్ల కట్టలతో పాటు పోలీస్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండడం వీడియోలో కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు.. డబ్బు సంచీతో పాటు కారును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ డబ్బు మంత్రి మల్లారెడ్డిదేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.